నిస్వార్థజీవి

                   నిస్వార్థజీవి

    తనకేమి లాభమ్ము తనభుజముల మోయ
                తన బిడ్డ పడునను తపన గాక !
    తనకేమి లాభమ్ము ధనమును వెచ్చింప
               బిడ్డల చదువుల ప్రేమగాక !
    తనకేమి లాభమ్ము తనయుల దిట్టుచో
               వారి యభ్యున్నతిన్ కోరి గాక !
    తనకేమి లాభమ్ము దయను జూపింపగా
               తన బిడ్డ కష్టమ్ము దలచి గాక !

      ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్థజీవి
      నాన్న యన మానవాకృతి నడచుదైవ..
      మతడు మన మార్గదర్శి , సహాయకారి
      తండ్రినిన్ మ్రొక్క జన్మమ్ము ధన్యమగును !!

Comments